మన శ్లోకాలు, పద్యాలు, గేయాలు. మన భాష, సంస్కృతి, వారసత్వం.
మరచుటలేదు నీ స్మరణ మాకితరేచ్ఛ మరేమిలేదు గా
పురమును నమ్మలేదు జలబుద్బుద సంపదగోరలేదు నీ
చరణములాన దర్శనవిచారమెమాత్రము గాని యింకయే
యరమరలేదులేదు భవదంఘ్రులజూపగదే మహాప్రభో
గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ
తస్మై శ్రీగురవే నమః
నారాయణ సమారంభాం
వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్యపర్యంతం
వందే గురుపరంపరాం
నిధయే సర్వవిద్యానాం
భిషజే భవరోగిణాం
గురవే సర్వలోకానాం
దక్షిణామూర్తయే నమః
కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ
కర మూలేతు గోవిందః, ప్రభాతే కర దర్శనం
సముద్రవసనే దేవీ, పర్వత స్తనమండలే
విష్ణుపత్నిర్నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి
త్వమేవ మాతాచ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ
యంతునదయో వర్షంతు పర్జన్యాః
సుపిప్పిలా ఓషధయో భవంతు
అన్నవతామోదనవతామమిక్షవతాం
ఏషాఙ్ రాజా భూయాసం
ఓదనముద్బ్రువతే, పరమేష్టీవా ఏషః యదోదనః
పరమామేవైనం శ్రియంగమయతి
మా భ్రాతా, భ్రాతరన్ ద్విక్షన్, మా స్వసారముతస్వసా
సమ్యంచస్సవ్రతాభూత్వా వాచన్ వదత భద్రయా
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
హరిర్దాతా హరిర్భోక్తా హరి రన్నం ప్రజాపతిః
హరిర్విప్ర శ్శరీరస్తు భుఙ్క్తే భోజయతే హరిః
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి
మాతాచ పార్వతీదేవీ, పితా దేవో మహేశ్వరః
బాంధవాశ్శివ భక్తాశ్చ, స్వదేశో భువనత్రయమ్
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోఽస్తుతే
రామస్కంధం హనూమంతం
వైనతేయం వృకోదరం
శయనే యః పఠేన్నిత్యం
దుస్స్వప్నః తస్యనశ్యతి
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం
కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వా
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యద్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః
లక్ష్మీతోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్ మాం శరణాగతం శరణద త్వం రక్షరక్షా ధునా
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తాస్సుఖినో భవంతు
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే
అగజాననపద్మార్కం
గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం
ఏకదంతముపాస్మహే
వక్రతుండ మహాకాయ
కోటిసూర్యసమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
గజాననం భూతగణాధిసేవితం
కపిత్థ జంబూ ఫలసార భక్షణం
ఉమాసుతం శోక వినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం
ఓం గణానాంత్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనా ముపవశ్రవస్తవం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత
ఆనశృణ్వన్నూతిభిః సీదసాదనం
యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్యాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్
సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి
పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయాం దేవీ
సా మాం పాతు సరస్వతీ
శారదా శారదాంభోజవందనా వదనాంబుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్
యాకుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండమండితకరా, యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదాపూజితా
సా మాం పాతు సరస్వతీ, భగవతీ, పూర్ణేందుబింబాననా
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
శారదనీరదేందు ఘనసారపటీర మరాళమల్లికా
హార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సిత తామర సామర వాహినీ శుభా
కారతనొప్పు నిన్మదినిగానగనెన్నడుగల్గు భారతీ
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు, వాహనంబులున్,
సొమ్ములుగొన్ని పుచ్చుకొని , చొక్కి, శరీరము వాసి, కాలుచే
సమ్మెట వ్రేటులంబడక, సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగధ్ధితంబుగన్
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్థమై
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్ |
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
ఓం నమో హిరణ్య బాహవే,
హిరణ్య వర్ణాయ, హిరణ్య రూపాయ, హిరణ్య పతయే,
అంబికాపతయే, ఉమాపతయే, పశుపతయే
నమో నమః
నమో హీరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః,
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపతయే నమః,
నమస్సస్పిఇజ్జరాయ ద్విషీమతే పథీనాం పతయే నమః,
నమో బభ్లుశాయవివ్యాధినేఽన్నానాం పతయే నమః,
నమో హరికేశాయోపవీతినే పుష్యానాం పతయే నమః,
నమో భవస్యహేత్యై జగతాం పతయే నమః,
నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాంపతయే నమః,
నమ స్సూతాయా హన్యాయ వనానాంపతయే నమః,
నమో రోహితాయస్థపతయే వృక్షాణాం పతయే నమః,
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః,
నమో భువన్తయేవారివస్కృతాయౌషధీనాం పతయే నమః,
నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పతీనాం పతయే నమః,
నమః కృత్స్న వీతాయ ధాతవేసత్వానాం పతయే నమః
నమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచారుణాయచ నమశ్శఙ్గాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రేవధాయచ దూరేవధాయచ నమో హన్త్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశ్శమ్భవేచ మయోభవేచ నమశ్శఙ్కరాయచ మయస్కరాయచ నమ శ్శివాయచ శివతరాయ చ
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండ డాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పట్త్వంచ హనుమత్స్మరణాద్భవేత్
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ
మూకం కరోతి వాచాలం పఙ్గుం లఙ్ఘయతే గిరిమ్
యత్కృపా తమహం వన్దే పరమానన్దమాధవమ్
కరారవిందేన పదారవిందం పదారవిందేన ముఖారవిందం
ముఖారవిందే వినివేశయంతమ్ వటస్య పత్రస్య పుటే శయానం
అంభోధి స్థలతాం స్థలం జలధితాం ధూళీలవశ్శైలతాం
మేరుర్మృత్కణతాం తృణం కులిశతాం వజ్రం తృణప్రాయతాం
వహ్నిశ్శీతలతాం హిమం దహనతాం ఆయాహి యస్యేచ్ఛయా
లీలాదుర్లలితాద్భుతవ్యసనినే దేవాయ తస్మైనమః
పంచాక్షరి
నమశ్శివాయ
అష్టాక్షరి
ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి
ఓం నమో భగవతే వాసుదేవాయ
షోడశాక్షరి
హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే
ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణం
వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాద్రావణకుంభకర్ణహననం హ్యేతద్ధి రామాయణం
ఆదౌ దేవకిదేవిగర్భజననం గోపీగృహే వర్ధనమ్
మాయాపూతనజీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్
కంసచ్ఛేదనకౌరవాదిహననం కుంతీసుతాం పాలనమ్
ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేనగ్రథితాం పురాణమునినామధ్యే మహాభారతం
అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం
అంబా త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీం
హిమాలయం సమారభ్య యావదిందుసరోవరం
తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే
ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణః
వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః
గాయంతి దేవాః కిల గీతకాని
ధన్యాస్తుయే భారత భూమిభాగే
స్వర్గాపవర్గాస్పదహేతుభూతే
భవంతి భూయః పురుషా మనుష్యా
అపి స్వర్ణమయీ లంకా
న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ
అయంబంధురయంనేతి
గణనా లఘుచేతసాం
ఉదార చరితానాంతు
వసుధైవ కుటుంబంకం
అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కథితం
పరోపకారః పుణ్యాయ, పాపాయ పర పీడనం
శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః
పరోపకారః పుణ్యాయ, పాపాయ పర పీడనం
అహింసా పరమో ధర్మః, అహింసా పరమం తపః
దయా సమం నాస్తి పుణ్యం, పాపం హింసా సమం న హి
అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతిఃపుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణోఃప్రీతికరం భవేత్
అశ్వం నైవ, గజం నైవ
వ్యాఘ్రం నైవ చ, నైవ చ
అజాపుత్రం బలిం దద్యాత్
దేవో దుర్బల ఘాతకః
|| హరిః ఓం తత్సత్ ||
LANGUAGE AND LEGACY
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన కరగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుల
అధికార ముద్రికల్ అంతరించె
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు
గంగలో కలసిపోయె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికన్ గన్న
చిత్రలేఖకుని కుంచియ నశియించె
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టులొలయ
అవనిపాలించు భస్మ సింహాసనంబు
ఎన్నో యేండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్
కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచి రాడక్కటా
ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్
పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట
వాని నుద్ధరించు భగవంతుడే లేడు
మనుజుడెట్లు వాని కనికరించు
వాడు చేసికొన్న పాపకారణమేమొ
యింతవరకు వాని కెరుక లేదు
ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే
చిక్కిన కాసుచే తనివి జెందు నమాయకు డెల్ల కష్టముల్
బుక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి
నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై
నా కవితా వధూటి ముఖమెల్ల నెగాదిగ జూచి రూపురే
ఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళియన్న వారె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లుగున్ పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్
ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు
రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
వాని ఱెక్కల కష్టంబు లేనినాడు
సస్యరము పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తిలేదు
వాని తల మీద పులిమిన పంకిలమును
కడిగి కరుణింపలేదయ్యె గగన గంగ
వాని నైవేద్యమున నంటువడిన నాడు
మూడు మూర్తులకును కూడ కూడు లేదు
ముప్పు ఘటించి వీని కులమున్ , గలిమిని కబళించి
దేహమున్ బిప్పియొనర్చునీ భరత వీరుని పాదము కందకుండగా
చెప్పులు కుట్టి జీవనముసేయునుగాని నిరాకరింపలే
దెన్నడు నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్
కులమతాల గీచుకున్న గీతల జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడనేను
బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః
అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్
విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే
వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్
వనజవనీ విహార కలనంబుఁ దొలంగగఁ జేయుఁగాని, గుం
భవమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ
జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్పఁ జాలునే
పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతపీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్
కొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే
రుండమదేభసింహనికురుంబములుండవెచేరిభాస్కరా
తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరి భంగి సర్వముం
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁదొల్లి, యిప్పుడు
జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలంగితిం, గతమయ్యె నితాంత గర్వమున్
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన, విశీర్ణమైన, సా
యాసమునైన, నష్టరుచి యైనను, బ్రాణభయార్తమైన, ని
స్త్రాసమదేభకుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం,
బొకచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి య
స్తోకాంభోధిఁ, బయోధి నుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష! పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్!
శ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడున్ సద
భ్యాసము లేని విద్య పరిహాసము లేని శుభ ప్రసంగమున్
గ్రాసము లేని కొల్వు కొరగానివి పెమ్మయసింగధీమణీ
నిను సేవింపగ నాపదల్వొడమనీ నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబుపై
కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ మేలు వ
చ్చిన రానీ అవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా
ఏ వేదంబు పఠించె లూత భుజంగ బేశాస్త్రముల్సూచె, దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచే మంత్రమూహించె, బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా, కావు, మీ పాదసం
సేవాసక్తియె గాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా
దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంగము రోయనప్పుడె జరాక్రాంతంబుగానప్పుడే
వింతల్మేన జరించునప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా
అంతా మిథ్య దలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది జరించుఁ గాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా
మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
డలియో పాదకరాక్షియుగ్మములు షట్కంజంబులో మోము దా
జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా
సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా
రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం
భోజాక్షీచతురంతయానతురగీ భూషాదులాత్మవ్యథా
బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిం బొందితిన్ జ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా
ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే
లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి
త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా
రికి లేదో మృతి యెన్నఁడుం గటకటా శ్రీ కాళహస్తీశ్వరా
అటజని గాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
కాంచెన్వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశా
ఖాంచజ్ఝాట చరన్మరుద్రయ దవీయః ప్రేషితోద్యచ్ఛదో
దంచత్కీటకృతవ్రణచ్ఛలన లిప్యాపాదితాధ్వన్య ని
స్సంచారాత్త మహాఫలోపమ ఫల స్ఫాయద్వటక్ష్మాజమున్
రక్షశ్శిక్షణ దక్ష రామ విశిఖ వ్రాతంబులోలిన్భవ
త్పక్షాపేక్ష సమక్ష రాక్షస బలాధ్యక్షాక్షయ క్రవ్యముల్
పక్షి క్షుద్గత రూక్ష వక్త్రములకున్ భక్షింప వేపెట్టినీ
దక్షప్రక్షిపదక్షి కుక్షి గళదోర్దర్పంబు చెండాడెడున్
రవిమధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజాత లగ్నంబునన్
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్
నన్నుఁ గన్న తండ్రి! నాపాలి దైవమ!
నాతపఃఫలంబ! నాకుమార!
నాదు చిన్ని వడుగ! నాకులదీపిక!
రాఁగదయ్య; భాగ్య రాశి వగుచు
భిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా
వత్తురె విప్రులు? వేఁడఁగ
నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం?
దెత్తురె మీరును సంపద?
లిత్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా
కలరున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి
ప్రులునేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ
డలఘుండై యొనరించె నధ్వరశతం బాభార్గవానుజ్ఞచే;
బలివేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా
ప్రక్షీణ దివిజ వల్లభ
రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
భిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్
హరిహరి; సిరి యురమునఁ గల
హరిహరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్
శర్మద, యమదండక్షత
వర్మద, నతి కఠిన ముక్తి వనితాచేతో
మర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్
చండస్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను
ద్దండాహూత మునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వే
దండాశ్వధ్వజనీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా
ర్తాండస్యందన ఘోటమున్, బలిమఖాంతర్వేది కావాటమున్
శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్
గుజగుజలు పోవువారును
గజిబిజిఁ బడువారు చాలఁ గలకల పడుచున్
గజిబిజి యైరి సభాస్థలిఁ
బ్రజలెల్లను బొట్టివడుగు పాపని రాకన్
వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱిఁ గబురులకుఁ జనుచు హరిహరి యనుచున్
మఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ
గుఱుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్
కొందఱతోఁజర్చించును
గొందఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం
గొందఱతోఁ దర్కించును
గొందఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్
వెడవెడ నడకలు నడచుచు
ఎడనెడ నడుగిడుచు నడరి యిలదిగబడగా
బుడిబుడి నుడువులు నుడువుచు
చిడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్
ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది
క్పతిగర్వాపనయప్రవర్తి, గతలోభస్ఫూర్తి, నానా మఖ
వ్రతదానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో
ద్ధతచంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి దాన్
స్వస్తిజగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ధ్వస్తనిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్తసువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్
వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్వంశమున్ జన్మముం;
గడుధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ గాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా
ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?
నొక చో టనక యెందు నుండ నేర్తు
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?
నాయంతవాఁడనై నడవనేర్తు
నీనడవడి యని యెట్లు వక్కాణింతుఁ?
బూని ముప్పోకల బోవ నేర్తు
నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ?
నేరుపు లన్నియు నేన నేర్తు
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు
ఏలితివి మూఁడు జగములుఁ
దోలితి వింద్రాది సురలఁ; దొల్లిటివారిం
బోలితివి దానగుణముల
సోలితివి పిశాచరాక్షసుల రక్షింపన్
ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!
ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె
వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసిబాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే
గొడుగో. జన్నిదమో, కమండలువొ, నాకున్ముంజియో, దండమో,
వడుఁగే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ?నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు;
సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు;
సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ;
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును;
జలధార ననలంబు సమయునట్లు
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీపదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు
దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడుఁ గాడు;
దేవకార్యంబు సాధించుకొఱకు
హరి విష్ణుఁ డవ్యయుం డదితి గర్భంబునఁ;
గశ్యపసూనుఁడై కలిఁగె; నకట!
యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి;
దైత్య సంతతి కుపద్రవము వచ్చు
నీలక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు;
వంచించి యిచ్చుఁ దా వాసవునకు
మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల
నఖిలకాయుఁ డగుచు నాక్రమించు
సర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి
బడుగు పగిది నెట్లు బ్రతికె దీవు
ఒక్కపదంబున భూమియు
నొక్కటఁ ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్
దిక్కులు గగనముఁ దానై
వెక్కసమై యున్న నెందు వెడలెదు? చెపుమా
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుం
డలతిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడైనిండు బ్రహ్మాండముం;
గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్;
వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా
కారేరాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరేకోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా
ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్
మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్
ఎన్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్నిపాపనిఁ ద్రోసిపుచ్చఁగఁ జిత్త మొల్లదు సత్తమా
బ్రతుక వచ్చుఁగాఁక బహుబంధనములైన
వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాటఁ దిరుఁగ లేరు మానధనులు
దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
వటుని కాళ్ళుఁ గడుగ వరహేమ ఘటమున
జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిఁగి
రమ్మామాణవకోత్తమ!
లెమ్మానీ వాంఛితంబు లేదన కిత్తుం
దెమ్మాయడుగుల నిటు రా
నిమ్మాకడుగంగవలయు నేటికిఁ దడయన్
బలిదైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్
జలజాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం
గలితానమ్ర రమా లలాటపదవీ కస్తూరికా శాదమున్
నలినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్
"విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
హ్మప్రీత"మ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందగన్
కమలనాభు నెరిగి, కాలంబు దేశంబు
నెరిగి, శుక్రు మాట లెరిగి, నాశ
మెరిగి, పాత్ర మనుచు నిచ్చె దానమ్ము బలి,
మహి వదాన్యు డొకడు మరియు గలడె
పరమేశ్వరార్పణంబుగ
పర జనులకు భిక్ష యిడిన పరమ పదంబుం
బరగెదరట తుది సాక్షా
త్పరమేశుడు భిక్ష గొన్న ఫలమెట్టిదియో
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టిబుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు" నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు
ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
చవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్నిండుచోన్
ఒకపాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్టకబ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్
దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి;
ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును;
స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీసొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు;
గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు;
నిరయంబు బొందుట నిజముగాదె?
కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
కాక యిచ్చెదవేని వేగంబ నాకు
నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?
సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీతృతీయపదము నిజము నా శిరమున
నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ
చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్?
శిలలం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే;
చలితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ
దలఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణాధర్మాదినిర్ముక్తుఁడై
చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దను వతి చంచల;
గార్యార్థు లన్యులు; గడచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర;
మని కాదె తమ తండ్రి నతకరించి
మాతాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు;
నీపాదకమలంబు నియతిఁ జేరె
భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!
కరిఁ దిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలన్
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో
ఓ కమలాప్త ! యో వరద ! యో ప్రతిపక్ష విపక్ష దూర ! కు
య్యో! కవియోగివంద్య సుగుణోత్తమ ! యో శరణాగతామరా
నోకహ ! యోమునీశ్వర మనోహర ! యో విమలప్రభావ ! రా
వే ! కరుణింపవే ! తలపవే ! శరణార్థిని నన్ను గావవే !
లా వొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్ఛెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై
తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధ వ్రాతమున్ దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్
అడిగెద నని కడు వడి జను
నడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్
వెడ వెడ జిడి ముడి తడ బడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
సర్వలఘు సీస పద్యం
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ గగనచరనది జనిత! నిగమవినుత!
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ! కటిఘటిత రుచిరతర కనకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత! సతతజపరత! నియమసరణి చరిత!
(తేటగీతి)
తిమి కమఠ కిటి నృహరి ముదిత! బలి నిహి
త పద! పరశుధర! దశవదన విదళన!
మురదమన! కలికలుష సుముదపహరణ!
కరివరద! ముని నర సుర గరుడ వినుత!
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ సప్తైథాశ్చిరంజీవినః
సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షసేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్
ఒరులేయవి యొనరించిన
నరవర! యప్రియము తన మనంబునకగు తా
నొరులకునవి సేయకునికె
పరాయణము పరమధర్మపథముల కెల్లన్
దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను దోర్లీలన్ వెసన్ బట్టి గం
ధర్వుల్ మానము ప్రాణముం గొనుట తథ్యంబె మ్మెయిం గీచకా
ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
భోరునిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధనునుగ్రరణాంతరంబునన్
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్సూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి సూచుచుండననినాస్వాదింతునుగ్రాకృతిన్
అంచితులైన బందుగుల యందరిముందఱ జెప్పి నిన్ను మె
చ్చించెద, కుంతి చేత, రవి చేత నిజంబని నీకు సాక్ష్య మి
ప్పించెద ఫల్గుణ ప్రముఖ వీరులు కొల్వగ యెల్లభూమి యే
లించెద నచ్చకీర్తి విరళీకృత సర్వదిగంతరంబుగన్
ఏ సతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ ము
న్నే సతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే
నేసతిమీది మోహమున నింతలుచేసిరి రాజు నీవు ని
న్నాసతి పెండ్లియాడ గల దాఱవ భర్తగ సూర్యనందనా
సూతుని చేతికిం దొరికి సూతకళత్రము పాలు ద్రావి, యా
సూతుని యన్నముం గుడిచి సూతకులాంగనయందు నందన
వ్రాతము గాంచి నేటికొక రాజకుమారుడ నంచు తెల్ప నా
చేతము సమ్మతించునె, ఇసీ! యెవరేగతి సిగ్గు మాలినన్
కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ
భూమి సమస్తమేలుకొను పూనిక చేతనె గాని నేను నా
సేమము గోరి చుట్టముల స్నేహితుల న్విడనాడి నేడు మ
త్స్వామి సుయోధను న్విడిచి వత్తునె, వచ్చిన మెత్తురే జనుల్
చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరుం
దొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబె గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్
జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియుం గూర్చి వే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకన్ జెండుచున్నప్పుడొ
క్కండు న్నీమొరనాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్
సంతోషంబున సంధిసేయుదురె వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం జూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము న్త్రావునాడైన ని
శ్చింతం దద్గదయుం ద్వదూరుయుగమున్ ఛేదించునా డేనియున్
బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్లభ్యము బట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
నీ వంశోన్నతి కోరు భీష్ముడును, నీమేల్గోరు ద్రోణాదిభూ
దేవుల్ సేమముమై మెసంగుదురె నీతేజంబు హెచ్చించుచున్
ఎక్కడనుండి రాక యిటకెల్లరునున్ సుఖులే కదా యశో
భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములున్
జక్కగనున్నవారె భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
జక్కగ నిల్చి శాంతుగతి తాను చరించునె తెల్పుమర్జునా
తమ్ముని కొడుకులు సగపా
లిమ్మనిరటు లిష్ట పడవయేనియు నైదూ
ళ్ళిమ్మని రైదుగురకు ధ
ర్మమ్ముగ నీ దోచినట్లు మనుపుము వారిన్
తనయుల వినిచెదవో నీ
తనయులతో నేమి యని స్వతంత్రించెదవో
చనుమొక రీతిని లేదే
నని యగు వంశ క్షయంబు నగు కురునాధా
ఐనను బోయిరావలయు హస్తినకచ్చట సంధిమాటలె
ట్లైనను శత్రురాజుల బలాబల సంపద జూడవచ్చు మీ
మానసమందుగల్గు యనుమానము తీర్పగవచ్చు, తత్సమా
ధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందులెల్లరున్
పాలడుగంగ కౌరవులపాలికి బోవ యతండు లోభియై
పాలది యేడదోయనిన పాల తెరంగరిగింపు భీమ భూ
పాలుని పాలు తాను తన పాలిటి రాజ్యము యన్న పాలు భూ
పాలకుమార సైన్యమొక పాలది మా అభిమన్యుపాలు నా
పాలు సమస్త సైన్యమని బల్కుము పంకజనాభ యచ్చటన్
కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువ యయ్యె, మాకు న
వ్వారికి గూడ నెక్కుడగు బంధు సముద్రుడ వీవు గాన, నీ
సేరిక మాకు నిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్
గోరగ నేగుదెంచితిమి గోపకులైకశిరో విభూషణా
ముందుగ వచ్చి తీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,
బందుగులన్న యంశ మది పాయక నిల్చె సహాయ మిర్వురన్
జెందుట పాడి, మీకు నయి జేసెద సైన్య విభాగ మందు మీ
కున్ దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు ముందుగన్
ఆయుధము పట్టడట యని
సేయండట "కంచి గరుడ సేవ" యితనిచే
నేయుపకృతి యుద్ధార్థికి
నేయెడ నగు నిట్టి వాని నెవ్వండు గొనున్
ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకే
సాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్
దోయిలి యొగ్గుదున్, నిజము, తొల్త వచించితి గోరికొమ్ము నీ
కేయది యిష్టమో, కడమ యీతని పాలగు పాండునందనా
నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కైల్మి జేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పు గాక, నీ
వెందును నాయుధమ్ము దరి కేగని కొప్పుదు గాక, కేశవా
ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేఱ కెల్ల చు
ట్టాలును రూపుమాయ కకటా యిల దక్కునె దక్క నిత్తురే
చాలును రాజ్యభాగము, ప్రజల్ సుఖియించిన నాకు జాలు, నే
జాలక కాదు సూవె తిన జాలను నెత్తురు కూడు మాధవా
నిదుర వోచుంటివో ! లేక బెదరి పల్కు
చుంటివో కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ యెన్న డీ చెవులు వినని,
కనులు చూడని శాంతంబు గానవచ్చె
కురుపతి పెన్దొడల్విరుగగొట్టెద, రొమ్ముపగిల్చివెచ్చనె
త్తురు కడుపార గ్రోలి యని దున్మెద దుష్టుని దుష్టసేను భీ
కరగద చేతనంచును ప్రగల్భములాడితివల్లగొల్వులో
మరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్టభోజనా
ఆలములోన నీ సుతుల నందఱి నొక్క గదా భుజంగికిన్
బాలొనరించి వచ్చిన నృపాలురు చూడగ నిచ్చువాడ నే
నూళులు తిండికిన్ బ్రతికి యుండిన మీకును దాసి వంచు బాం-
చాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతీ వధూటికిన్
చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ
కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్
పచ్చని కొంప మాపితివి బాపురె కౌరవనాథ నీ సగం
బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్
అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న
య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా
భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్
ప్రతిదినమేగె బాష్పకణ భారనిరోధ దిశాంత నేత్రమై
ప్రతి వకుళమ్ము రాలె శిశిరాత్తదళాంత గళోచ్చనాదమై
ప్రతి తెలివేకువన్ తొలగి రాలెను తారలు గాజుపూసలై
అతివ కదల్పకీ వయసుటద్దపు మేడ పునాదిగోడలన్
గరళపు ముద్ద లోహ మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయ లయకారుడు కమ్మరి వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్
అస్తివద్బకవచ్చైవ చల్లవత్తెల్లకుక్కవత్
రాజతే భోజతే కీర్తిః పునస్సన్యాసి దంతవత్
కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితాః
కోఽహం రండే త్వమేవాహం త్వమేవాహం న సంశయః
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ
కుల్లాయుంచితి, గోకసుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచుల దోసంబంచు బోనాడితిన్
తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్
చక్కని నీ ముఖ చంద్రబింబమునకు
గళ్యాణమస్తు బంగారు బొమ్మ
నిద్దంపు నీ చెక్కుటద్దంపు రేకకు
నైశ్వర్యమస్తు నెయ్యంపుదీవి
మీటిన బగులు నీ మెరుగు బాలిండ్లకు
సౌభాగ్యమస్తు భద్రేభయాన
వలపులు గులుకు నీ వాలు గన్నులకు న
త్యధిక భోగోస్తు పద్మాయతాక్షి
మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును
వైభవోన్నతిరస్తు లావణ్యసీమ
వన్నెచిన్నెలు గల్గు నీ మన్ననలకు
శాశ్వతస్థితి రస్తు యోషా లలామ
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే
మా కలిదిండి కామయ కుమారకు డన్నిట తండ్రి వైఖరే
కాక తదన్యుడెట్లగును గాడిదకుం దురగంబు పుట్టునే
చేకొని కొంకినక్కకును సింగము పుట్టునె మాలకాకికిం
గోకిల పుట్టునే చిరుతకుక్కకు మత్తగజంబు వుట్టునే
మేత గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల
సిరిగల వానికి జెల్లును
దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
జొన్న కలి జొన్న యంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బలినాటి సీమ ప్రజలందరకున్
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు
గరళము మ్రింగితి ననుచుం
బురహర గర్వింపబోకు పో పో పో నీ
బిరుదింక గానవచ్చెడి
మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ
ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్
ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కపివరుండు కసవురేడు
గుంపు గాగ నిచట గురజాల సీమలో
నోగు లెల్ల గూడి రొక్క చోట
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా
పురవీధి నెదురెండ పొగడదండ
యాంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబునన్
దగిలియుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
వియ్యమందెను గదా వెదురుగొడియ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
నగరి వాకిట నుండు నల్లగుండు
కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె దిలలు బెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు
కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయ డిచ్చు
కైలాసగిరి పంట మైలారువిభు డేగె
దినవెచ్చ మే రాజు తీర్చగలడు
రంభఁ గూడె తెలుంగురాయరాహుత్తుండు
కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు
స్వర్గస్థుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండఁ గష్ట మనుచు
దివిజకవివరుల గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి
ఎమితిని సెపితివి కపితము
బెమపడి వెరిబుచ్చకాయ వడిదిని సెపితో
ఉమెతక్కయ తిని సెపితివొ
అమవసనిసి యనెడు మాట అలసని పెదనా
స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటిపల్కులకేలకల్గెనో
యతులితమాధురీమహిమ హా తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వారవనితాజనతాఘనతాపహారసం
తత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ
గంజాయి తాగి, తురకల
సంజాతము గూడి, కల్లు చవిగొన్నావా
_____ కొడకా, ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
రంజనచెడి పాండవులరి
భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా
సంజయ ఏమని చెప్పుదు
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
తెన్నాలి రామలింగడు
తిన్నాడుర తట్టెడంత తియ్యని బెల్లం
బెన్నగ మన పింగళి
సూరన్నకు నోరంత పేడ అయ్యెను కదరా
తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
బలుకగ రాకు రోయి పలుమార్లు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతువా ప్రగడరాన్నరసా విరసా తుసా బుసా
ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వ మం
దొకనికి తప్పు బట్ట పనియుండదు కాదని తప్పుబట్టినన్
మొగమటు కిందుగాదిగిచి మొక్కలువోవని యిన్ప కత్తి తో
సిగ మొదలంటగ్రోయుదును చెప్పునగొట్టుదు మోము దన్నుదున్
తెలుగదేల యన్న, దేశంబు దెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
యెల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స
తరువులతిరసఫలభార గురుతగాంచు
నింగివ్రేలుచునమృతమొసంగు మేఘుడు
ఉద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత
జగతి ఉపకర్తలకు యిది సహజగుణము
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ
అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు ఏరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ
అక్కరకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ
ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగినేని మరి యతుక నేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ
అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
అల్పుడెపుడు బల్కునాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ
ఆత్మ శుద్ధి లేని యాచార మదియేల
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ
ఉప్పుగప్పురంబు నొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
గేయాలు
జయ జయ జయ గీర్వాణ సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
బ్రహ్మ ముఖోద్గత వేద శరీరే, బ్రహ్మర్షీ శ్రుత వేదాధారే
కర ధృత పావన వేద ప్రకరే, కంకణ టంకృత మహదోంకారే
జయ వేద సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
శ్లోకీకృత శోకాంబుకువలయే, సుకవి కుల గురో శుభ వాంగ్ నిలయే
భవభూతేస్సువచో రసాలయే, భారవి ప్రముఖ కృతి కృత వలయే
జయ కావ్య సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
సామగాన మంగళ మృదు నినదే, శంకర తుంబురు నారద వరదే
త్యాగరాయ గళ విన్యస్తపదే, తరళిత వీణావాద నిశుభదే
జయ గాన సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
భావ రాగ తాళాంగ సంయుతే, భరతే నపురా కీర్తిత నృత్తే
సిద్ధేంద్ర మహాయోగి నిగదితే, శివ గౌరీ తాండవ లాస్య రతే
జయ నాట్య సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
నిఖిల కళా నిర్మాణ సమర్థే, నిఖిల పరిశ్రమ శిక్షణ సార్థే
సూత్ర చక్ర సంభ్రమణ కరార్థే, సూత్ర సంవయన శాంతి పరార్థే
జయ సూత్ర సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
పంచనదీ పరిగత భూజాతే, పావన గంగా భంగోద్గీతే
గోదా కావేరీ తటాంకితే, కోటి కోటి భారత జన వినుతే
గీర్వాణ సరస్వతీ, ప్రణవ గాన విశారదే, శారదే
వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో
తెలుగు బావుట కన్ను చెదరగ కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తి దెబ్బలు గండికోటను గాచినప్పుడు
తెలుగు వారల వేడి నెత్తురు తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున్న సహ్యజ కత్తి నెత్తురు కడిగినప్పుడు
ఇట్టి సందియ మెన్నడేనియు బుట్టలేదు రవంతయున్
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు లేకపోయిరి సుంతయున్
నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగండెన్నడున్
బాస యిచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడున్
ఇదిగో యున్నది వీర గంధము మైనలందుము మైన లందుము
శాంతి పర్వము చదువవచ్చును శాంతి సమరంబైన పిమ్మట
తెలుగు నాటను వీర మాతను జేసి మాత్రము తిరిగి రమ్మిక
పలు తుపాకులు పలు ఫిరంగులు దారికడ్డము రాక తప్పవు
వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో
(త్రిపురనేని రామస్వామి చౌదరి)
దేశమును ప్రేమించుమన్నా, మంచి యన్నది పెంచుమన్నా
ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్
పాడి పంటలు పొంగిపొరలే దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరకులు నింపవోయ్
వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి వెనుకపడితే వెనకే నోయి
పూను స్పర్థను విద్యలందే వైరములు వాణిజ్యమందే
వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే నేర్పరికి మేల్ కొల్లలోయ్
సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగిమణగీ కవిత కోవిల పలకవలెనోయ్
పలుకులను విని దేశమందభి మానములు మొలకెత్తవలెనోయ్
(గురజాడ అప్పారావు)
శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
వేద శాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యంబందెనిచ్చట
బాదరాయణ పరమఋషులకు పాదుసుమ్మిది చెల్లెలా
విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట
విపులతత్వము విస్తరించిన విమలతలమిదె తమ్ముడా
సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ
చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెనె చెల్లెలా
మేలికిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తీ
పాలతీయని భావిభారత పదము పాడర తమ్ముడా
నవరసమ్ములు నాట్యమాడగ చివురుపలుకులు చెవులవిందుగ
కవితలల్లిన క్రాంతిహృదయుల గారవింపవె చెల్లెలా
దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా
పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల కలసి పాడవె చెల్లెలా
లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల చేర్చి పాడర తమ్ముడా
తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి
భంగపడని తెనుంగునాథుల పాట పాడవె చెల్లెలా
(రాయప్రోలు సుబ్బారావు)
నమో మంగళ శ్రీ మహా మాతృభూమే
నమో భారతాఖ్యా సవిత్రీ లలామే
నమస్తే హిమాహార్య ధమ్మిల్ల తారా
నమస్తే త్రివేణీ భర క్షీర ధారా
అలందీప్యతే తావ కీనా పతాకా
త్రివర్ణాయితా కూత చక్ర ప్రతీకా
జ్వలంతీ తవ క్షాత్ర శస్త్రాస్త్ర మాలా
వృణీతే స్వయం శాంతిమక్రూరశీలా
ధ్రువంతే ప్రజా రామరాజ్యం స్వతంత్రం
పరంతేహ్యహింసా ముఖ స్వీయ మంత్రం
ప్రశామ్యంతుచాన్నాంబర క్షామ ఖేదాః
వినశ్యంతు రాష్ట్ర ప్రజామిత్ర భేదాః
అశోకం భవేదార్తి జుష్టం ప్రపంచం
చిరం వర్ధతాం భారతీయం చరిత్రం
మనసా సతతం స్మరణీయం
వచసా సతతం వదనీయం
లోకహితం మమ కరణీయం
న భోగ భవనే రమణీయం
న చ సుఖ శయనే శయనీయం
అహర్నిశం జాగరణీయం
లోకహితం మమ కరణీయం
న జాతు దుఃఖం గమనీయం
న చ నిజ సౌఖ్యం మననీయం
కార్య క్షేత్రే త్వరణీయం
లోకహితం మమ కరణీయం
దుఃఖ సాగరే తరణీయం
కష్ట పర్వతే చరణీయం
విపత్తి విపినే భ్రమణీయం
లోకహితం మమ కరణీయం
గహనారణ్యే ఘనాంధకారే
బంధుజనా యే స్థితా గహ్వరే
తత్ర మయా సంచరణీయం
లోకహితం మమ కరణీయం
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
జనియించినాడవీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందూ
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక
ఓడలా జెండాలు ఆడునందాక
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాల గీతములు
పాడరా నీ వీర భావ భారతము
తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధము భక్తరత్నముల్ పిదుక
దిక్కుల్లకెగదన్ను తేజమ్ము వెలుగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ
జగములను ఊగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినది ఈ దివ్య విశ్వంబు పుత్రా
దీవించెనీ దివ్య దేశంబు పుత్రా
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానలా కస్తూరి కాచెరా మనకు
అవమానమేలరా అనుమానమేల
భారతీయుడనంచు భక్తితో పాడ
(రాయప్రోలు సుబ్బారావు)
ఏ దేశచరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం
పిశాచగణ సమవాకారం
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకుతినడం
బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున
కాకుంటే కన్నీళులతో
చల్లారిన సంసారాలూ
మరణించిన జన సందోహం
అసహాయుల హహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి
వైషమ్యం, స్వార్థపరత్వం
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్థలు
మాయలతో, మారుపేర్లతో
చరిత్రగతి నిరూపించినవి
జెంఘిజ్ఖాన్, తామర్లేనూ
నాదిర్ షా, గజినీ, ఘోరీ
సికిందరో ఎవడైతేనేం
ఒక్కొక్కడు మహాహంతకుడు
వైకింగులు, శ్వేత హూణులూ
సిథియన్లూ, పారశీకులూ
పిండారులు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమచట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను
చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు
చీనాలో రిక్షావాలా,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ –
హాటెన్ టాట్, జూలూ, నీగ్రో,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్ధతత్వం
చాటిస్తా రొక గొంతుకతో
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం
ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కావోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీలెవ్వరు?
తక్షశిలా, పాటలిపుత్రం,
మధ్యధరా సముద్రతీరం,
హారప్పా, మొహెంజొదారో,
క్రో – మాన్యాన్ గుహముఖాల్లో –
చారిత్రక విభాత సంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించినదేపరమార్ధం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
(శ్రీ శ్రీ)
పతితులార ! భ్రష్టులార ! బాధాసర్ప దష్టులార !
బ్రదుకు కాలి, పనికిమాలి,
శని దేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన
దీనులార ! హీనులార !
కూడు లేని, గూడు లేని
పక్షులార ! భిక్షులార !
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు---
జితాసువులు, చ్యుతాశయులు, హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి !
మీరక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి.
ఓ వ్యథానివిష్టులార ! ఓ కథావశిష్టులార !
పతితులార ! భ్రష్టులార ! బాధాసర్పదష్టులార !
ఏడవకం డేడవకండి !
వస్తున్నా యొస్తున్నాయి...
జగన్నాథ, జగన్నాథ, జగన్నాథ రథచక్రాల్ !
జన్నాథుని రథచక్రాల్ !
రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి !
పతితులార ! భ్రష్టులార !
మొయిల్దారిని బయల్దేరిన
రథచక్రాల్, రథచక్రా లొస్తున్నాయొస్తున్నాయి !
సింహాచలం కదిలింది, హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది---
సింహాచలం, హిమాచలం, వింధ్యాచలం, సంధ్యాచలం...
మహానగా లెగురుతున్నాయి !
మహారథం కదులుతున్నాది !
చూర్ణమాన ఘూర్ణమాన దీర్ణమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి !
పతితులార ! భ్రష్టులార ! బాధాసర్పదష్టులార !
రారండో ! రండో! రండి!
వూరవతల నీరింకిన చెరువుపక్క, చెట్టునీడ---
గోనెలతో, కుండలతో, ఎటు చూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటునిరాశ---
చెరసాలలు, ఉరికొయ్యలు, కాలువలో ఆత్మహత్య !
దగాపడిన తమ్ములార !
మీ బాధలు నే నెరుగుదును...
వడిలో, కడు జడిలో, పెను చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పతితులార ! భ్రష్టులార ! దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టి , ఆకాసపు దారులంట
అడావుడిగ వెళిపోయే, అరుచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్, రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను ! భూకంపం పుట్టిస్తాను !
నట ధూర్జటి నిటాలాక్షి పగిలిందట !
నిటాలాగ్ని రగిలిందట !
నిటాలాగ్ని ! నిటాలార్చి !
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది !
అరెఝా ! ఝా! ఝుటక్, ఫటక్ ...
హింసనణచ ధ్వంసరచన, ధ్వంసనణచ హింసరచన
విషవాయువు, మరఫిరంగి, టార్పీడో, టోర్నిడో!
అది విలయం, అదిసమరం, అటో యిటో తెగిపోతుంది
సంరంభం, సంక్షోభం, సమ్మర్దన, సంఘర్షణ !
హాలహలం పొగ చూరింది !
కోలాహలం చెలరేగింది !
పతితులార ! భ్రష్టులార !
ఇది సవనం, ఇది సమరం !
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్య్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్ద్రం
పునాదులై ఇళ్లు లేచి,
జనావళికి శుభం పూచి---
శాంతి, శాంతి, కాంతి, కాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ స్వర్గం ఋజువవుతుంది !
పతితులార ! భ్రష్టులార ! బాధాసర్పదష్టులార !
దగాపడిన తమ్ములార ! ఏడవకం డేడవకండి !
వచ్చేశాయ్ , విచ్చేశాయ్,
జగన్నాథ, జగన్నాథ, జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్
రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈ లోకం మీదేనండి!
మీ రాజ్యం మీరేలండి!
(శ్రీ శ్రీ)
మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా ఈ కథను ?
ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?
కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది.
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.
కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో
కిలకిల పలికెను కీరములు.
ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణమ
దుర్గను చేరీ దుఃఖించె
కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.
పసుపు రాసిరీ బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.
పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !
చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల కప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.
"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.
"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ
నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."
బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.
యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.
ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.
కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.
(గురజాడ)
తగటు బంగరు చీరె కట్టి
కురుల పువ్వుల సరులు జుట్టి
నుదుట కుంకుమ బొట్టు పెట్టి
సొంపు పెంపారన్;
తొగల కాంతులు కనులు పరపగ
మించు తళుకులు నగలు నెరపగ
నడక లంచకు నడలు కరపగ
కన్నె పరతెంచెన్ రాజవీథిని.
పసిడి కడవల పాలు పెరుగులు
పళ్లెరమ్ముల పళ్ళు పువ్వులు
మోము లందున మొలక నవ్వులు
చెలగ చెలికత్తెల్ వెంట నడిచిరి.
అంత పట్టపు రాజు యెదురై
కన్నె సొగసుకు కన్ను చెదురై
మరుని వాడికి గుండె బెదురై
యిట్లు తలపోసెన్.
"ఔర ! చుక్కల నడుమ చందురు
నట్లు వెలిగెడు కన్నె ముందర
వన్నె కాంచిన నగరి సుందరు
లంద రొక లెక్కా !
"పట్టవలెరా దీని బలిమిని
కొట్టవలెరా మరుని రాజ్యం
కట్టవలెరా గండపెండెం
రసిక మండలిలో."
నాల నడమను నట్టి వీథిని
దుష్ట మంత్రులు తాను పెండెం
గట్టి కన్నెను చుట్టి నరపతి
పట్ట నుంకించెన్.
"ముట్టబోకుడు, దేవకార్యం
తీర్చి వచ్చెద, నీవు పట్టం
యేలు రాజువు, సెట్టి కూతర
నెటకు పోనేర్తున్.
చుట్టములు తన చుట్టు నిలవగ
భృత్య వర్గం కాచి కొలవగ
సెట్టి కరములు మోడ్చి రాజుకు
ఇట్లు వినిపించెన్.
"పట్టమేలే రాజ ! బలిమిని
పట్టవలెనా ? నీదు సొమ్మే
కాద కన్నియ ? నీవు కోరుట
కన్న మరి కలదా వైశ్యజాతికి వన్నె ?
"గాని మన్నన జేసి మమ్ముల
బంధువర్గం, కులం పెద్దల
ధర్మమన్నది అరసి కొంచెం
దారి కనబడితే,
అగ్నిసాక్షిగ కన్నె గైకొని
ఆదరించుము మమ్ము, కానుక
లందు కొమ్మెంతంత వలసిన,
మనుచు మాజాతిన్."
నవ్వి హేళన నవ్వు, నరపతి
పల్కె, "నోహో! ధర్మ మార్గం
పట్టమేలే రాచబిడ్డకు
సెట్టి కరపడమా !
"రాజు తలచిందేను ధర్మం
రాజు చెప్పిందెల్ల శాస్త్రం
రాజులకు పేరైన పద్ధతి
కాద, గాంధర్వం ?
"తడవు చెయ్యక తల్లడిల్లక
నేడు రేపని గడువు పెట్టక,
నెమ్మి గోరితివేని, కన్నియ
నిమ్ము! లేకుంటే, పొమ్ము!
"డేగ, పిట్టను పట్టి విడుచున ?
కన్నె, యింటికి మరలి నడచున,
తెమ్ము కానుక లిమ్ము, నీవిటు
వచ్చినందాకన్,
కదల"; నంతట సెట్టి పలికెను,
"దేవకార్యం ముందు, ఆవల
రాచకార్యం కాద, రాజా !
శలవు నీవిస్తే.
"యింటి దైవం వీరభద్రుడి
దేవళానికి పోయి యిప్పుడె
పళ్లెరం సాగించి వత్తును,
పైని తమ చిత్తం !"
"మంచిదే, మరి నడువు, మేమును
తోడ వత్తుము, దేవళంలో
అగ్ని సాక్షిగ కన్యకను మే
మందుకొన గలము."
నాడు గుడిలో మండె గుండం
మంట మింటిని ముట్టి యాడగ,
కన్న నరపతి గుండె దిగులై
పట్టు విడ జొచ్చెన్.
భక్తి పరవశ మైన మనసున
దుర్గ నప్పుడు కొలిచి, కన్యక
ముక్తి వేడుచు వూడ్చి నగలను
శక్తి కర్పించెన్.
దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట
రక్త గంధం రక్త మాల్యం
దాల్చి, గుండం చుట్టు నిలిచిన,
జనుల కిట్లనియెన్ !
"అన్న లారా తండ్రులారా
ఆలకించం డొక్క విన్నప
మాలు బిడ్డల కాసు కొనుటకు
ఆశలే దొక్కొ కులము లోపల ?
"పట్టమేలే రాజు అయితే
రాజు నేలే దైవ ముండడొ ?
పరువు నిలపను పౌరుషము మీ
కేల కలగదొకో ?
"విద్య నేర్చినవాడు విప్రుడు
వీర్య ముండిన వాడు క్షత్రియు
డన్న పెద్దల ధర్మ పద్ధతి
మరచి, పదవులకై
"ఆశ చేయక, కాసు వీసం
కలిగి వుంటే చాలు ననుకొని,
వీర్య మెరుగక, విద్య నేర్చక
బుద్ధి మాలినచో,
కలగవా యిక్కట్లు ? మేల్కొని,
బుద్ధి బలమును బాహు బలమును
పెంచి, దైవము నందు భారం
వుంచి, రాజులలో
"రాజులై మను డయ్య !" ఇట్లని
కన్య నరపతి కప్పుడెదురై
నాలు గడుడులు నడిచి ముందుకు
పలికె నీ రీతిన్.
"పట్టపగలే, నట్టవీధిని
పట్టబోరే జార చోరులు,
పట్టదలచితి వింక నీవొక
పట్టమేలే రాజువట !
"కండకావర మెక్కి నీవీ
దుండగము తలపెట్టినందుకు
వుండదా వొక దైవమంటూ,
వుండి వూర్కొనునా ?
"కులం పెద్దలు కూడి రదుగో !
అగ్నిసాక్షికి అగ్ని అదుగో !
కన్ను కోరిన కన్నె యిదుగో !
జాల మేలొక్కో ?
"పట్టమేలే రాజువైతే
పట్టు నన్నిపు" డనుచు కన్యక
చుట్టి ముట్టిన మంట లోనికి
మట్టి తా జనియన్ !
పట్టమేలే రాజు గర్వం
మట్టి గలిసెను, కోట పేటలు
కూలి, నక్కల కాటపట్టయి
అమరె,
యెక్కడైతే కన్య, మానం
కాచుకొనుటకు మంట గలిసెనొ
అక్కడొక్కటి లేచె సౌధము
ఆకసము పొడుగై.
పట్టమేలే రాజు పోయెను,
మట్టి కలిసెను కోట పేటలు,
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్.
శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు
రెండు ఖడ్గాలు
రెండు ఖంజరీటాలు
రెండు అగ్నిపర్వతాలు
రెండు ఆంజనేయ దండకాలు
జో జో
జే జే
రెండు కంకాళాల కార్తీక దీపాలు
రెండు రాబందుల రా(జా)జీనామాలు
రెండు కళ్ళు తెరిచిన నాగళ్ళు
రెండు పిడికిళ్ళు బిగించిన కొడవళ్ళు
హా హా
హూ హూ
రెండు కళ్ళు
రెండు కళ్ళజోళ్ళు
రెండు కళ్ళజోళ్ళ నోళ్ళు
రెండు కళ్ళజోళ్ళ నోళ్ళ వాగుళ్ళు
హీ హీ
రీ రీ
రెండు టెలిగ్రామ్య భాషలు
రెండు సమస్తాంధ్ర ఘోషలు
రెండు నిండు కొబ్బరికాయలు
రెండు ఎండు నారింజకాయలు
బా బా
బీ బీ
రెండు చదువురాని విస్తరాకులు
రెండు దారితప్పిపోయిన కిరీటాలు
రెండు చీకటింట్లో రాకాసి కేకలు
రెండు నిలబడ్డ నిట్టూర్పు కొరడాలు
దా దా
దీ దీ
రెండు వేషాలు విప్పివేసిన తలగడాల కింద
నిద్ర మేల్కొన్న నఖక్షతాలు
రెండు నిశ్శబ్దాలు విసిరిన స రి గ మ ప ద ని శ ల మీద
నీడలు పలికించిన విలోల కల్లోలాలు
రెండు యుగాంతాల సందున దిగంతాల మాటున
వసంతా లాడుకునే అనంతాలు
నే నే
నా నా
రెండు జగన్నాథ రథరథ రథాధర ధరాధర
రసాతల (జల) పాతాళాలు
రెండు స్వయంశమం వరంతకం ప్రకంపమాన
లోకాలోక విలోకనాలు
రెండు భ్రమాభ్రమర భ్రమణ భ్రమరణ
భ్రమావరణ బ్రహ్మవైవస్వత మన్వంతరాలు
రెండు నవరత్న - రంధ్ర
రస ప్రపంచ మహాప్రస్థానాలు
రెండు చాలీచాలని కాలీకాలని లంగావంచాలు
రెండు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ థియేటర్ స్టార్లు
రెండు ఆరుద్రాభిషేకాలు
రెండు రిక్షాపై మౌన శంఖాలు
రెండు విబ్జియార్భాటాలు
రెండు హనుమత్ శాస్త్రాలు
రెండు నమస్కరించదగిన విశ్వనారాయణాస్త్రాలు
రెండు నామరహిత ఫిడేలు రాగారాబాలు
రెండు పిఠాపిఠా కఠోరకుఠారాలు
రెండు గోరావీణా వినాయకకారాగారాలు
రెండు తృవ్వట బాబా సిగపై పువ్వులు
రెండు సరి సిరి మువ్వల నవ్వులు
రెండు బీరెండ వాసన ఒకట్లు
రెండు తురుఫానుమానాలు
రెండు తుపాకి స్నానాలు
రెండు సిన్ సిన్ కిస్ కిస్ కిస్ కోణాలు
రెండు ఖడ్గాల కంఖాణాలు
రెండు కళ్ళ నోళ్ళు
రెండు కళ్ళు తెరిచిన పిడికిళ్ళు బిగించిన
మానవ సరోవరంలో వికసించిన
మందారాక్షరాల
మరచిపోలేని
మద్రాక్షస
ముద్రాక్షసరాలు
ఢంకా, మాసపత్రిక - నవంబర్, 1944
Comments
Post a Comment